జేఎన్‌యూ హింసపై మరో ట్విస్ట్‌

 న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన  జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) హింసపై కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ నెల 5న (ఆదివారం) వర్సిటీలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను దుమారాన్నే సృష్టించింది. తమపై ఏబీవీపీకి చెందిన వారు దాడి చేశారని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించగా.. వారే తమపై దాడికి దిగారని ఏబీవీపీ ప్రతి ఆరోపణలకు దిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన పలు కీలక అంశాలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వర్సిటీ పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించిన అనంతరం దాడిలో పాల్గొన్న విద్యార్థుల ఫోటోలను విడుదల చేశారు. దీనిలో జేఎన్‌యూ విద్యార్థి నేత ఆయిషీ ఘోష్‌తో పాటు తొమ్మిది మంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ఈనెల 5న వర్సిటీలోని పెరియర్‌ హాస్టల్‌పై దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.